Penamaluru Cyber Cheating పెనమలూరులో సైబర్ మోసం బయటపడింది. ఓ వ్యక్తి మొబైల్‌కు ఓ లింక్ వచ్చింది.. వెంటనే దానిని క్లిక్ చేయడంతో మొబైల్ హ్యాక్ అయ్యింది. అతడు తన మొబైల్‌ను ఉపయోగించలేకపోయాడు.. ఇంతలో ఆయన క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకున్నట్లు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా డబ్బులు మాయం అయ్యాయి. అప్పుడు మోసపోయానని భావించి వెంటనే ఈ మోసంపై పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.సైబర్ మోసాలకు అమాయకులు బలవుతున్నారు సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎప్పటి నుంచో పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్, మొబైల్‌కు తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయినా సరే కొందరు అమాయకంగా లింకులు నొక్కి ఇలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు.. కొందరు కేటుగాళ్లు వాట్సాప్‌లకు లింక్ పంపించి అకౌంట్‌లను ఖాళీ చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు వచ్చిన లింక్ నొక్కి అకౌంట్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. పెదపులిపాకకు చెందిన గద్దే బాలకృష్ణారావుకు ఐసీఐసీఐ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఇదే బ్యాంకులో రూ.3.20 లక్షల లిమిట్‌తో అతడికి క్రెడిట్ కార్డు కూడా ఉంది. ఈనెల 19న అతడి వాట్సాప్‌కు 98321 48702 నంబరు నుంచి ఓ లింక్ వచ్చింది. బాలకృష్ణారావు దానిని నొక్కిన వెంటనే ఫోన్ హ్యాక్ అయ్యిందిఅతడికి వెంటనే ఓటీపీలు రాగా.. బాలకృష్ణారావు ప్రమేయం లేకుండానే ఇతడి నంబరు నుంచి 89109 53502కు ఓటీపీలు వెళ్లాయి. అప్పటి నుంచి తన మొబైల్ సైతం ఉపయోగించుకోలేకపోయారు. ఈలోగా ఆయన క్రెడిట్ కార్డు నుంచి రూ.3 లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నట్లు.. దీని నుంచే పలు విడతలుగా రూ.1,73,967 ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు.. వ్యక్తిగత అకౌంట్ నుంచి రూ.10,006 డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి..ఇలా డబ్బులు మాయం కావడంతో బాలకృష్ణారావు ఆందోళనకు గురయ్యాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి అకౌంట్‌లను పరిశీలించగా ఆయా మెసేజ్‌లు నిజమేనని, డబ్బులు తన ప్రమేయం లేకుండా వేరే అకౌంట్‌లకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలకృష్ణారావు మొత్తం రూ.4.83 లక్షలు కోల్పోవాల్సి వచ్చింది.
116 Views