కలెక్టరేట్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం..!
నాగర్ కర్నూల్: భూ సమస్యకు పరిష్కారం లభించలేదని నిరసిస్తూ మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది.
దీన్ని గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు చోటు చేసుకుంది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం సల్కర్ పేట గ్రామానికి చెందిన తిప్పర్తి జ్యోతి కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదం నెలకొంది.
రెండు సంవత్సరాలుగా ప్రజా ప్రతినిధులకు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో చావే శరణ్యమని భావించిన ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ ను కలిపించారు. కాగా గ్రామంలో తమ మామ నుంచి వారసత్వంగా తన భర్త చంద్రారెడ్డి కి రావలసిన వ్యవసాయ భూమిని తన భావ వెంకట్ రెడ్డి అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
గత రెండు సంవత్సరాలుగా తమకు న్యాయం చేయాలని రాజకీయ నాయకులకు అధికారులకు మొరపెట్టుకున్నా తమకు న్యాయం చేయకుండా వారికే వత్తాసు పలుకుతున్నారని తమకు చెందాల్సిన మరో రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కూడా తనకు చెందకుండా తమ దాయాదులు కబ్జా చేసుకున్నారని ఆరోపించారు.
