పంచాయతీ కార్మికులపై.. దయ చూపండి!
హైదరాబాద్ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకం. కానీ వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో, వారి సమస్యలన్నీ పరిష్కరించడంలో పాలకులు విఫలమవుతున్నారు.
ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయడం లేదు. పర్మినెంట్ అయిన వారికి ప్రమోషన్లు కల్పించడం లేదు. మల్టీ పర్పస్ విధానంతో వారిపై పనిభారం పెంచుతున్నారు.
విధులకు సంబంధం లేని పనులు చేయిస్తూ.. వారితో శ్రమ దోపిడీ చేయిస్తున్నారు. వారికి కనీస వేతనం ఇవ్వకపోవడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల గురించి మర్చిపోయారు.
ఫలితంగా చాలీ చాలని వేతనాలతో కార్మికులు అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే, తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ.. కార్మికులు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించుకునే వరకూ సమ్మె విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో సుమారు 60 వేల మంది కార్మికులు పారిశుధ్యం, పంప్ ఆపరేటర్లు, కారోబార్లు, ఎలక్ట్రీషియన్లు, బిల్ కలెక్టర్లు వంటి విభాగాల్లో పని చేస్తున్నారు.
ఎండా, వానా, చలితో సంబంధం లేకుండా వీరు ప్రత్యక్షంగా 24 గంటల పాటు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇందులో నూటికి 80 శాతం మంది దళితులే ఉన్నారు.
కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పంచాయతీ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించారు. తమ రోజువారీ విధుల నిర్వహణతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పచ్చదనం పరిశుభ్రత ప్రోగ్రామ్‌ను కష్టపడి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన విధానంలో ముఖ్య భూమిక పోషిస్తున్న పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
2014, 2018లో జరిగిన ఎన్నికల సందర్భంగా పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చారు, కానీ 9 ఏండ్లు గడుస్తున్నా నేటికీ చేయలేదు.
జీవో 60 ప్రకారం కనీస వేతనం రూ.19 వేలు ఇవ్వాల్సి ఉన్నా ప్రస్తుతం రూ.8,500లు మాత్రమే ఇస్తున్నారు. పెరిగిన ధరలతో పోల్చితే వచ్చిన వేతనం సరిపోక కార్మికులు, వారి కుటుంబాలు అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి ఉన్నది….