ఏపీలో ఇటీవల భారీ వర్షాలు పడటంతో రోడ్లపైకి వరద చేరుకుంది. వరద ప్రవాహంతో ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్లల్లోకి నీరు చేరుకోవడంతో వందల మంది నిరాశ్రయులుగా మారారు. వరద నీళ్లు రోడ్లపైకి చేరుకోవడంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే భారీ వర్షాలకు రైతుల పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది.మనుషులే కాదు జంతువులు కూడా వరదకు ఇబ్బందులు పడ్డాయి. తాజాగా వరదలో చిక్కుకున్న తన పిల్లల్ని కాపాడాలంటూ ఓ శునకం అధికారులను మూగగా వేడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తన పిల్లలను రక్షించారంటూ అధికారుల వెంట పడిన తీరు అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. పిల్లలను కాపాడుకునేందుకు ఈ శునకం పడిన తపన అందరినీ ఆకట్టుకుంటోంది. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో మున్నేరు వాగు సమీపంలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.ఐతవరం వద్ద ఓ ఇంట్లో రెండు పిల్లలకు శునకం జన్మనిచ్చింది. అయితే కుక్క పిల్లలున్న ఇంటిని మున్నేరు వరద ముంచెత్తింది. పాల కోసం పిల్లలు అరుస్తుండగా వెళ్లేదారి లేక అలాగే తల్లి శునకం దీనంగా చూస్తూ ఉండిపోయింది. మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పోలీసులు, ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న ఓ శునకం రోజంతా వారి చుట్టూనే తిరుగుతూ ఉంది. దీంతో రెస్క్యూ సిబ్బందికి అనుమానం వచ్చి శునకాన్ని అనుసరిస్తూ వెళ్లారు. దీంతో ఓ ఇంట్లో చిక్కుకుపోయిన శునకం పిల్లలు సిబ్బందికి కనిపించాయి. దీంతో కుక్కపిల్లలను సహాయక బృందాలు వరద నీళ్లల్లోనుంచి బయటకు తీసుకొచ్చాయి. ఆ తర్వాత పిల్లలకు శునకం పాలిచ్చి వాటి ఆకలి తీర్చింది.కొంతమంది ఈ సన్నివేశాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మరింది. కుక్క అధికారుల వెంట పడుతుండగా.. పిల్లలను నీళ్లల్లోనుంచి బయటకు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. మనుషులకే కాదు జంతువులకు కూడా తమ పిల్లల పట్ల ప్రేమ ఉంటుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.