Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం వైద్యం

చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స పూర్తి.. ‘నీ వాష్’ చేసిన వైద్యులు

చిరంజీవ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆయన తన మోకాలికి మైనర్ సర్జరీ చేయించుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. న్యూఢిల్లీలో ఆయన తన మోకాలికి చిన్న ఆపరేషన్ చేయించుకున్నారు. ఒక వారం రోజుల పాటు ఆయన న్యూఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటారని.. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వస్తారని మెగాస్టార్ పీఆర్ టీమ్ వెల్లడించింది. కాగా, చిరంజీవికి ‘నీ వాష్’ సర్జరీ చేసినట్టు సమాచారం. ఈ శస్త్రచికిత్సను ఆర్థ్రోస్కోపిక్ నీ వాషౌట్ అని కూడా అంటారట. అంటే, మోకాలిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఈ శస్త్రచికిత్స ద్వారా ఆర్థోప్లాస్టీ చేసి క్లియర్ చేస్తారట. ఇది చిన్న శస్త్రచికిత్సే. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ సాయంతో చేస్తారు. కాబట్టి, చిరంజీవికి వారం రోజుల విశ్రాంతి సరిపోతుంది.

చిరంజీవికి మోకాలికి శస్త్ర చికిత్స జరగనున్నట్టు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బెంగళూరు లేదంటే న్యూఢిల్లీలో ఆపరేషన్ జరుగుతుందని.. ఈ నెలాఖరున మళ్లీ చిరు హైదరాబాద్ వస్తారని కొంతమంది సినీ విశ్లేషకులు సోషల్ మీడియాలో చెప్పారు. దీంతో మెగాస్టార్ అభిమానులు కాస్త కంగారు పడ్డారు. కానీ, ఇప్పుడు పీఆర్ టీమ్ ఇచ్చిన సమాచారంతో వాళ్లకు ఊపిరిపీల్చుకుంటారు. ఇది చిన్న సర్జరీ అని స్పష్టత రావడంతో అన్నయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే, చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోగా.. సినిమా మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తీవ్రంగా చతికిలపడింది. దీంతో మెగాస్టార్ ఖాతాలో మరో భారీ డిజాస్టర్ నమోదైంది. ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ‘భోళా శంకర్’లో మెహర్ రమేష్ ఎలాంటి కొత్తదనాన్ని చూపించకపోవడం డిజాస్టర్‌కు ప్రధాన కారణం. దీనికి తోడు చిరంజీవి లాంటి సీనియర్ యాక్టర్‌తో వెకిలి కామెడీ చేయించడం అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.

‘భోళా శంకర్’ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.33 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓపెనింగ్ బాగానే ఉన్నా సినిమాకు వచ్చిన డిజాస్టర్ టాక్‌తో రెండో రోజు నుంచే కలెక్షన్లు భారీగా పడిపోయాయి. నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.41 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ.26 కోట్ల మేర ఉందని తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే నాలుగు రోజుల్లో ‘భోళా శంకర్’ రూ.33 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసిందట. దీనిలో రూ.21 కోట్ల మేర షేర్ ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.80 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ చేయాలంటే ఇంకా రూ.54 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. ఇది అసాధ్యం.

Related posts

వివేకా హత్య కేసు: నేను చెప్పినదానిని సీబీఐ మార్చింది.. హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం..

HJNEWS

విజయవాడ: కొంపముంచిన వాట్సాప్ లింక్.. రూ.4.83 లక్షలు పోగొట్టుకున్నాడు, చిన్న తప్పుతో!

HJNEWS

మాజీ మంత్రి ” జూపల్లి ”చేరికను వరుణుడు కూడా అంగీకరించడం లేదు.!!

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్