తిరుమలలో అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు కర్రలు పంపిణీ చేయాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిరుతపులులు, వన్య మృగాలను ఎదుర్కొనేందుకు భక్తులకు ఊత కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ విమర్శలపై ఆయన ఏమంటున్నారు?
అలిపిరి నడక మార్గంలో తిరుమల కొండకు నడిచి వెళ్లే భక్తుల కోసం టీటీడీ కర్రలను సిద్ధం చేసింది. భక్తులు ఈ కర్రలను చేత పట్టుకొని, అరుపులు చేసుకుంటూ.. గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించింది. తిరుమల నడకదారిలో లక్షిత అనే చిన్నారిపై చిరుత పులి దాడి చేసి చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి తిరుమల కొండకు వెళ్తున్న లక్షితను చిరుత పులి లాక్కెళ్లి చంపేసింది. దేవుడి దర్శనం కోసమని వెళ్లి, బిడ్డను కోల్పోయిన లక్షిత తల్లి చేసిన రోదనలు అందరినీ కదిలించాయి. ఈ ఘటన అనంతరం టీటీడీ పలు చర్యలు చేపట్టింది. నడక దారిలో వెళ్లే భక్తులకు కర్రలు పంపిణీ చేయాలనేది ఇందులో ఒక భాగం. అయితే, టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై కొంత మంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
‘అలిపిరి నుంచి కొండకు నడిచి వెళ్లాలనుకునే వారికి కర్రసాము నేర్పబడును’ అంటూ ఓ ట్విటర్ యూజర్ వీడియో పోస్టు చేశారు. ‘ఎలా వస్తాయి? మీకు ఇలాంటి ఐడియాలు..?’ అని కామెంట్లు పెడుతూ పలువురు నెటిజన్లు వీడియోలను పోస్టు చేస్తున్నారు.
‘కర్ర తీసుకొని ఇప్పుడు చిరుతపులితో ఫైటింగ్ చేయాలా?’ అంటూ కొంత మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జనసేన, టీడీపీ తదితర విపక్ష పార్టీలకు చెందిన కొంత మంది అభిమానులైతే.. ఒకింత పరుష పదజాలంతో దుయ్యబడుతున్నారు.
మరోవైపు.. కర్రలను చేత పట్టుకొని, అరుపులు చేసుకుంటూ వెళ్తే.. చిరుతలు భయపడి భక్తుల వైపు రావని టీటీడీ చెబుతోంది. అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. అటవీ శాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కర్రలు ఇచ్చి.. చేతులు దులిపేసుకుంటున్నారంటూ విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.