113 Views
అమరావతి : ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ … ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ కాలేజ్ అతిధి అధ్యాపకుల సంఘం నేతలు సజ్జల కార్యాలయాన్ని ముట్టడించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిధి అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ‘ జగనన్నే మా భవిష్యత్తు ‘ అనే నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్లు మాట్లాడుతూ … దాదాపు రెండు సంవత్సరాల పాత బకాయిలను ఎపి సర్కార్ ఇంతవరకూ చెల్లించలేదని వాపోయారు. గత తొమ్మిది సంవత్సరాల నుండి పదివేల రూపాయల జీతంతో రెగ్యులర్, పార్ట్ టైం, ఎంటిఎస్, కాంట్రాక్ట్ లెక్చరర్‌లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నామని, కానీ ఇంతవరకూ తమ జీతభత్యాలను పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.