Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్రాజకీయం

పవన్‌ కళ్యాణ్‌ను చూస్తే జాలేస్తోంది.. ఆయనకు ఆ ఆలోచనే రావడం లేదు: మంత్రి అమర్

104 Views

వారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పవన్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు. కేంద్రానికి కాకపోతే అమెరికా, రష్యా అధ్యక్షులకు చెప్పుకోవచ్చన్నారు. పవన్‌కు కేంద్రంలో పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు. తనకు పవన్ కళ్యాణ్, జనసైనికుల్ని చూస్తుంటే జాలేస్తోందన్నారు మంత్రి గుడివాడ అమర్.

వారాహి యాత్రలో భాగంగా విశాఖలో పర్యటించిన జనసేన పార్టీ (Jansena Party) అధినేత పవన్‌ కళ్యాణ్.. స్టీల్‌ప్లాంట్‌ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా అంటూ ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. కేంద్రంలో పవన్‌కు పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సవాల్ చేశారు. కేంద్రంలో పవన్ కళ్యాణ్‌కు పలుకుబడి కాదు చంద్రబాబు రాబడి అన్నారు. వారాహి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేంద్రానికి చెబితే ఎవరికి భయం.. ప్రభుత్వం చేసిన తప్పేంటని ప్రశ్నించారు.

ఎవరికో చెబితే భయపడే ప్రభుత్వం జగన్‌ది కాదని తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు. కేంద్రానికి కాకపోతే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి చెప్పుకోవచ్చు అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలు అహంకారం, అసత్యం, అసూయతో మాట్లాడినట్లుగా ఉందన్నారు. పవన్ దత్త తండ్రి చంద్రబాబు మాత్రమే అధికారంలో ఉండాలన్న ఆలోచనతో ప్రసంగించారని.. జనసేన పార్టీ, పవన్ రాజకీయంగా ఎదగాలన్న ఆలోచన ప్రసంగంలో లేదన్నారు. సిద్ధాంతం విధానం.. రానున్న ఎన్నికల్లో పోటీ ప్రణాళిక పవన్‌లో కనిపించలేదన్నారు.

సినిమాల్లో కథా నాయకుడుగా పవన్ తీరు బావుండొచ్చు.. కానీ రాజకీయాల్లో తగదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే నాయకుడు అయిపోతారని అనుకుంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్‌ను చూస్తుంటే జాలేస్తోందని.. అల్పుడు ఆడంబరంగా అనే వేమన పద్యం పవన్‌కు సరిగ్గా సరిపోతుందన్నారు. అసలు పవన్ కళ్యాణ్ కి సిద్దాంతాలు లేవని.. ఒక్కో ఎన్నికలలో, ఒక్కో పార్టీ తో పొత్తు పెట్టుకుంటారన్నారు. సంసారం బీజేపీతో.. సహజీవనం టీడీపీతోలా పరిస్థితి ఉందన్నారు.

జనసేన అధికారంలోకి వస్తే ఫలానా పథకం అమలు చేస్తామని ఎందుకు చెప్పరని ప్రశ్నించారు మంత్రి అమర్. ఎవరికో బానిస మాదిరిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని.. పవన్ తీరు చూస్తుంటే అతని కార్యకర్త లపై జాలేస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఈర్ష్యతో మాట్లాడుతున్నారని.. వైఎస్ జగన్ అధికారంలో నుంచి వెళ్లి పోవాలని చెప్పారే కానీ.. పవన్ తనను అధికారంలో తీసుకురావాలని ప్రజల్ని కోరడం లేదన్నారు. ఎప్పుడైనా జనసేన పార్టీకి రాజకీయ గుర్తింపు వచ్చే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు.

మహిళలపై ఈ మధ్య పవన్ కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు మంత్రి. సినిమాల్లో మహిళల గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారని.. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్‌లపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మహిళలపై కపట ప్రేమ చూపిస్తున్న పవన్.. ముద్రగడ కుటుంబ సభ్యులపై దాడి జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో గంజాయి రవాణా జరుగుతున్నట్టు అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడినప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు.

గంటా అనుచరులు భూ కుంభకోణం చేశారని అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేసినప్పుడు పవన్ ఎక్కడ దాక్కున్నారన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎంత భూ కబ్జా చేశారో కనిపించ లేదా అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడరన్నారు. ఈ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకు వర్తింపజేసిందని.. రాజకీయాన్ని వ్యాపారం చేసింది పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజనకు కారకులు ఎవరు.. నామా నాగేశ్వరరావు, అశోక్ గజపతి రాజు లేఖ ఇవ్వలేదా అన్నారు. విశాఖ రాజధాని రావడం ఖాయం.. అప్పుడు ఎలాగూ పవన్ కళ్యాణ్ విశాఖ రావడం తప్పదన్నారు.

Related posts

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లోకి ఆ బీఆర్ఎస్ కీలక నేత

HJNEWS

వాగులో కొట్టుకొస్తున్న వజ్రాలు.. అడవిలో వేట, బిజీగా జనం

HJNEWS

జగన్ చాలా పెద్ద తప్పు చేశారు.. ఘోరంగా ఓడిపోతారు : ప్రశాంత్ కిషోర్

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్