స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సెక్యులరిజం పేరిట ఇతర మతాలను తిడతామంటే కుదరదని, ఏదైనా ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించనంత వరకే అని చెప్పారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జనసేన కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అనంతరం పార్టీ వీర మహిళలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డ పవన్.. పలు కీలక ప్రకటనలు చేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అక్రమ ఆస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చినవారికి గిఫ్ట్ ఇచ్చేలా ఒక కార్యక్రమం తీసుకొస్తామని స్పష్టం చేశారు.
వైసీపీని గెలిపించకపోతే పథకాలు రావనే భయం వద్దని, ఇంకా మంచి చేసే పథకాలు ఇస్తామని తెలిపారు. దయచేసి అందరూ అండగా నిలబడాలని, మీ బిడ్డల భవిష్యత్తు కోసం బలంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామని, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకుంటామని తెలిపారు. కనీసం గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం తాగడానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని, భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. జనసేన పార్టీ అధ్వర్యంలో ప్రజా కోర్టు అనే పేరుతో సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ చేయనున్నట్లు ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు.
38 కేసులు ఉన్న వైఎస్ జగన్ కోర్టు తీర్పులను తప్పు పడతారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని పవన్ విమర్శించారు. స్త్రీ తలచుకుంటే మార్పు ఖచ్చితంగా వస్తుందని, మీరు బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తామని వీర మహిళలకు సూచించారు. ఇంకోసారి సీఎం జగన్ అధికారంలోకి వస్తే తాము ఏపీలో ఉండలేమని, వేరే రాష్ట్రాలకు, దేశాలకు పారిపోతామని కొంతమంది అంటున్నారని, అలాంటివారు ఎక్కడకు వెళతారు? అని ప్రశ్నించారు. ఎక్కడకు వెళ్లినా వివక్ష ఉంటుందని, మీరెందుకు మీ నేల విడిచి వెళ్లిపోవాలి? ఎదురు తిరగాలి కదా..? అని సూచనలు చేశారు.
‘రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకు సరైన గౌరవం దక్కలేదు. ప్రభుత్వాలు ఆయనను విస్మరించాయి. ఒక వర్గానికి ఆయనను పరిమితం చేశాయి. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి మహనీయులను గౌరవించుకుంటాం. మహిళ వంటగదికి పరిమితం కాకూడదు. తన స్వంత కాళ్ళ మీద నిలబడాలి అని కోరుకుంటాను. చట్టసభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ఉండాలి. దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకునేలా ఒక క్యాలెండర్ విడుదల చేయాలి’ అని పవన్ పేర్కొన్నారు.