పలువురు దుండగులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ దళిత మహిళ ఆరోపించింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఒంటరిగా ఉంటున్న దళిత మహిళపై పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. తనపై వైసీపీ నాయకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దుశ్చర్యను వీడియో కూడా తీసి, పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది.
బాధితురాలి ఫిర్యాదు, ‘ఈనాడు’ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని ఓ గ్రామంలో ఓ దళిత మహిళ నివసిస్తోంది. ఆమెకు ఏడేళ్ల కిందట ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే అతడికి మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలియడంతో తన తల్లిగారింటికి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో ఆమె ఆ ఇంట్లోనే ఒంటరిగా నివసిస్తోంది. కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది.
అయితే ఆ గ్రామంలో నివసించే ఐదుగురు వైసీపీ నాయకుల కన్ను ఆ ఒంటరి మహిళపై పడింది. ఏడాది కిందట ఒక రోజు వారు ఐదుగురు కలిసి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. ఈ దుశ్చర్యను వారు తమ సెల్ ఫోన్ లలో వీడియో కూడా తీశారు. తరువాత ఆ వీడియోలను చూపిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై పలు మార్లు లైంగిక దోపిడికి ఒడిగడుతున్నారు. కొంత కాలం తరువాత ఆ వీడియోలు దుండగులు ఆ గ్రామంలో నివసించే హరి అనే వ్యక్తికి షేర్ చేశారు. ఆ వీడియోను ఆధారంగా చేసుకొని అతడు కూడా ఆమెపై తన కామవాంఛ తీర్చుకోవాలని భావించాడు. లైంగిక వేధింపులకు గురి చేయసాగాడు.
అయితే వీరి ఆగడాలు తట్టుకోలేని బాధితురాలు రెండు మాసాల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ తృటిలో ప్రాణాలు దక్కాయి. అయినప్పటికీ ఆ దుండగులు బాధితురాలిని వదిలిపెట్టలేదు. ఈ నెల 10వ తేదీన ఆ మహిళ ఒంటరిగా ఉండటాన్ని హరి గమనించాడు. ఆమెపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. వెంటనే స్థానికులందరూ అక్కడికి వచ్చారు. హరి ఇంట్లో నుంచి పారిపోకుండా చూసేందుకు తలుపులు మూసివేశారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే అదే రోజు సాయంత్రం సమయంలో విడిచిపెట్టేశారు.
మరుసటి రోజు బాధిత మహిళ తన బంధువులతో కలిసి కళ్యాణదుర్గంకు వెళ్లినా అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. మళ్లీ ఆమె రెండు రోజుల కిందట గ్రామస్తులను తీసుకొని స్టేషన్ కు వెళ్లింది. ఇది చిన్న కేసు కదా అని పోలీసులు సమాధానం చెప్పినట్టు బంధువులు ఆరోపించారు. అక్కడ తనకు న్యాయం జరగదని భావించిన బాధితురాలు సోమవారం ఎస్పీ ఆఫీసుకు వెళ్లింది. ఉదయం సమయంలో ఎస్పీ శ్రీనివాసరావును కలిసి ఈ విషయంలో ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన డీఎస్పీ శ్రీనివాసులుతో మాట్లాడారు. ఈ కేసులో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా..ఈ కేసుపై కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. వివాహితపై గ్యాంగ్ రేప్ జరగలేదని చెప్పారు. బాధితురాలు ఈ నెల 10వ తేదీన ఒంటరిగా ఇంట్లో ఉందని, దీంతో ఆ గ్రామానికి చెందిన హరి ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని చెప్పారు. ఈ ఘటనలో నిందితుడిని పిలిపించామని, విచారించామని పేర్కొన్నారు. సామూహిక అత్యాచారం జరిగిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు.