వైసీపీ నుంచి తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఉండవల్లి శ్రీదేవి భవిష్యత్ వ్యూహాలపై దృష్టిపెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ పై బెంగగా ఉన్నట్లు కనిపిస్తున్న ఉండవల్లి శ్రీదేవి ఆ మేరకు విపక్ష టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ స్ధానిక నేతలతో ఆమె చర్చలు జరిపినట్లు కూడా సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తర్వాత వైసీపీ సస్పెండ్ చేయడంతో ఆ పార్టీకి దూరమైన ఉండవల్లి శ్రీదేవిపై స్ధానిక నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో ఆమె చేతిలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కూడా ఆమెతో పోటా పోటీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో టీడీపీలోకి వెళ్లేందుకు కూడా ఆమెకు అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరి ఎమ్మెల్సీ పదవి తీసుకునే అవకాశాలూ లేకపోలేదు.
దీంతో ఉండవల్లి శ్రీదేవి టీడీపీ దిశగా అడుగులేస్తున్నారు. ఇవాళ చంద్రబాబును ఆమె కలిసే అవకాశం ఉంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల టూర్ లో ఉన్నారు. ఇందులో భాగంగా వంశధార ప్రాజెక్టు వద్ద ఆయన్ను తన భర్త శ్రీధర్ తో పాటు వెళ్లి కలిసేందుకు శ్రీదేవి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ నేతలతో ఆమె మంతనాలు జరిపినట్లు సమాచారం. చంద్రబాబును ఇవాళ కలిసి మద్దతు ప్రకటించి, ఆ తర్వాత మంచిరోజు చూసుకుని ఇతర వైసీపీ మాజీ ఎమ్మెల్యేల తరహాలోనే టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.
శ్రీదేవి టీడీపీలోకి వస్తే తాడికొండ ఇన్ ఛార్జ్ గా ఉన్న శ్రవణ్ కుమార్ ముందుగా అభ్యంతరం చెబుతారు. అయితే ఆయన సీటు శ్రీదేవికి కేటాయించే అవకాశాలు తక్కువే. కాబట్టి ఆమెకు చంద్రబాబు మరేదైనా హామీ ఇవ్వడమో, లేక ఇతర సీట్ల నుంచి పోటీ చేయించడమో చేస్తారని భావిస్తున్నారు. ఏది జరిగినా అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యే కాబట్టి ఆమెకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తే సానుకూల ఫలితం ఉంటుందని ఆశిస్తున్నారు.