పవన్ మూడో విడత వారాహి విజయ యాత్రకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టు 10 నుంచి విశాఖలో పవన్ యాత్ర స్టార్ట్ కానుంది. ఇప్పటికే జనసేన శ్రేణులు యాత్రకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్రలో పవన్ ఎవరిని టార్గెట్ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ వారాహి యాత్రకు కౌంటర్‌గా అధికార వైసీపీ కూడా వ్యూహలు సిద్దం చేసుకుంటోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. తన ప్రచార రథం వారాహితో మళ్లీ ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర చేపట్టారు. రెండో విడతలుగా జరిగిన ఈ యాత్ర జనసేన నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహన్ని నింపింది. గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉండటంతో.. ప్రజలకు నుంచి వారాహి విజయ యాత్రకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో విడత వారాహి యాత్ర చేపట్టాలని పవన్ నిర్ణయించారు.
విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రను పవన్ ప్రారంభించనున్నారు. ఆగస్టు 10 నుంచి యాత్ర జరిపేందుకు ముహూర్తం ఖరారు చేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విశాఖ నేతలతో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూడో విడత వారాహి యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కంటే మరింత విజయవంతంగా జరిగేలా వీర మహిళలు, జనసైనికులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటినుంచే యాత్రకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు.
వారాహి యాత్రలో భాగంగా పవన్ ర్యాలీలు నిర్వహించడంతో పాటు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంతో పాటు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్‌గా చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఇటీవల వారాహి యాత్రలో వాలంటీర్లు, మహిళల మిస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అలాగే అంతకుముందు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతికి సంబంధించిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. దీంతో పాటు పొత్తులపై కూడా పవన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు.
మూడో విడత వారాహి యాత్రలో పవన్ ఎవరిని టార్గెట్ చేస్తారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చుతామని, త్వరలోనే అక్కడికి తాను మకాం మార్చుతానంటూ జగన్ పలుమార్లు తెలిపారు. అలాగే విశాఖలో వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారని, రిషికొండను మొత్తం తవ్వేశారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో విశాఖ రాజధాని అంశం గురించి పవన్ మాట్లాడే అవకాశముంది. ఇక పవన్‌పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎప్పుడూ ఏవోక విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో విశాఖ నుంచి జరిపే వారాహి యాత్రో అమర్‌నాథ్‌ను పవన్ టార్గెట్ చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పవన్ మూడో విడత వారాహి యాత్రతో ఏపీ పాలిటిక్స్ మరింత హీటెక్కే అవకాశముంది.