Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
JANASENA

పవన్ కళ్యాణ్‌కి డబ్బంటే ఆశ లేదు.. చాలా అరుదైన వ్యక్తి: రేణూ దేశాయ్

94 Views

పవన్ కళ్యాణ్‌కు, వైసీపీ నాయకుల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధం నేపథ్యంలో జనసేనాని మాజీ భార్య రేణూ దేశాయ్ రంగంలోకి దిగారు. పొలిటికల్ వార్‌లోకి పవన్ కళ్యాణ్ పిల్లల్ని లాగొద్దంటూ ఆమె వేడుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌‌‌కు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తనకు చేసింది 100 శాతం తప్పని.. అయినప్పటికీ ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా ఆయనకు తన మద్దతు ఉంటుందని ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఒక విన్నపం చేశారు. దయచేసి పవన్ కళ్యాణ్ పిల్లలను రాజకీయ రొంపిలోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియో మెసేజ్ పెట్టారు.

పవన్ కళ్యాణ్‌కు, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య పొలిటికల్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పొలిటికల్ వార్ కాస్త ఈ మధ్య పర్సనల్ వార్ అయిపోయింది. ‘బ్రో’ సినిమాలో మంత్రి అంబటి రాంబాబును పోలి ఉన్న శ్యాంబాబు అనే పాత్ర పెట్టడం.. ఆ పాత్రపై సెటైర్లు వేయడంతో రాంబాబుకు మండింది. ఆయన ‘బ్రో’ సినిమాను, పవన్ కళ్యాణ్‌ను విమర్శించడానికే ప్రత్యేక ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. ఆఖరికి ‘బ్రో’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తేలాలంటూ ఢిల్లీ వెళ్లి ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు.

తనతో పాటు కొంత మంది వైసీపీ నాయకులు కలిసి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నామని అంబటి రాంబాబు ఆ మధ్య ప్రెస్ మీట్‌లో ప్రకటించారు. కథ కూడా చెప్పారు. ఒక ప్రముఖ సినీ నటుడికి తమ్ముడైన వ్యక్తి ఒక పెళ్లి చేసుకున్నాడని.. ఆమెకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నాడని.. ఇద్దరు పిల్లలు పుట్టాక ఆవిడకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నాడని.. ఇలా అచ్చం పవన్ కళ్యాణ్ జీవితాన్ని పోలి ఉన్న కథ చెప్పారు. అంటే, పవన్ కళ్యాణ్ జీవిత కథనే అంబటి రాంబాబు వెబ్ సిరీస్ తీయనున్నట్టు స్పష్టమైంది. అయితే, ఈ వెబ్‌ సిరీస్‌లోకి దయచేసి పవన్ కళ్యాణ్ పిల్లలను లాగవద్దని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు.

‘నా మాజీ భర్తతో విభేదాలు ఉన్న కొంత మంది ఆయన వ్యక్తిగత జీవితంపై సినిమా లేదంటే వెబ్ సిరీస్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిలోకి ఆయన భార్యలను, నలుగురు పిల్లలను కూడా లాగుతున్నారు. ఒక తల్లిగా ఇది నా వ్యక్తిగత విజ్ఞప్తి. రాజకీయమా, సినిమాలా పరిస్థితి ఏదైనా అయ్యుండొచ్చు. కానీ, దయచేసి దీనిలోకి పిల్లలను లాగకండి. ఈ పిల్లలు ఒక ఫిల్మ్ ఫ్యామిలీలో పుట్టారని నాకు తెలుసు.

తండ్రి ఒక నటుడు, రాజకీయ నాయకుడు. కాబట్టి ఆ ప్రభావం పిల్లలపై కూడా ఉంటుంది. అయినప్పటికీ వాళ్లు పిల్లలు. వాళ్లకు రాజకీయాలతో, ప్రస్తుతం జరుగుతున్న విషయాలతో సంబంధం ఏముంది. కాబట్టి ఒక తల్లిగా నేను వేడుకుంటున్నాను.. ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్, సపోర్టర్స్ దయచేసి పిల్లల్ని లాగకండి. నా పిల్లలనే కాదు.. ఏ రాజకీయ నాయకుడి, సినిమా నటుడి పిల్లల్ని లాగకండి. పిల్లల్ని, ఆడవాళ్లను వీటిలోకి లాగొద్దు’ అని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు.

సామాజిక సేవ, రాజకీయాల్లో తన మాజీ భర్తకు తొలి రోజు నుంచీ తాను మద్దుతుగా నిలుస్తున్నానని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. ‘ఆయన నా విషయంలో చేసింది 100 శాతం తప్పు. దీనిలో ఎలాంటి డౌటూ లేదు డిస్కషన్ అవసరం లేదు. కానీ, ఆయన సమాజానికి మంచి చేయడానికే ఉన్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు గుర్తున్న, తెలిసిన అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయనకు డబ్బంటే ఆశలేదు.

ఆయన ఎప్పుడూ సమాజానికి మంచి చేయాలని అనుకుంటారు. పేదల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి. నేను నా వ్యక్తిగత బాధను పక్కనపెట్టి ఆయనకి పొలిటికల్‌గా సపోర్ట్ చేస్తాను. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టి.. ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకు నేను ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఆయన చాలా సక్సెస్‌ఫుల్ యాక్టర్. కావాలంటే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందుతూ డబ్బులు సంపాదించుకోవచ్చు.

కానీ, ఫ్యామిలీని, వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. దయచేసి ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఈరోజు నేను ఆయనకు మాజీ భార్యగా మాట్లాడడం లేదు. సమాజంలో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నా స్థానంలోకి వచ్చిన ఆయన్ను చూడండి. ఆయన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగకండి’ అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.

Related posts

అక్రమ ఆస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చేవారికి గిఫ్ట్.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

HJNEWS

పవన్ కల్యాణ్ పైన ముద్రగడ పద్మనాభం పోటీకి వైసిపి ప్లాన్?

HJNEWS

జనసేన 24 సీట్లకే పరిమితం కావడం సిగ్గుచేటు: ఆర్కే రోజా

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్