తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి.. నదులతో పాటూ వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అక్కడక్కడా రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.. అయితే హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపైకి భారీగా వరద నీరు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం నేషనల్ హైవేపై నుంచి మున్నేరు వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. పోలీసులు అప్రమత్తమై ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించారు.గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ – హైదరాబాద్ మధ్య కీసర సమీపంలో 65 హైవేపై మున్నేరు వాగు ప్రవహిస్తోందన్నారు పోలీసులు. ఈ కారణంగా వాహనాల రాకపోకలకు వీలు లేదని.. అందుకే హైదరాబాద్ – విజయవాడ, విజయవాడ – హైదరాబాద్ ల మధ్య ప్రస్తుత పరిఫ్టితుల దృష్ట్యా ప్రయాణికుల క్షేమం కోరి వాహనములను అనుమతించడం లేదని తెలిపారు. కావున ఈ విషయాన్నిప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వయా విజయవాడ మీదుగా వెళ్లేవారు.. హైదరాబాద్, నార్కట్‌పల్లి, మిర్యాలగూడ, దాడేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా వెళ్లాలని సూచించారు. కావున వాహనాదారులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని.. తమనకు సహకరించాలని పోలీసులు కోరారు. ప్రజలు, వాహనదారులు పోలీస్ శాఖ వారికి సహకరించాలని.. ఏదైనా సమాచారం కొరకు పోలిస్ కంటోల్ రూం నెంబర్ 7328909090 కు సంప్రదించాలని సూచించారు. అంతేకాదు విజయవాడ – హైదరాబాద్ హైవేపై మున్నేరు దగ్గర 2008 తర్వాత ఈ ఏడాదే ఈ స్థాయిలో వరద నీరు వచ్చినట్లు చెబుతున్నారు. అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్నారు.మరోవైపు ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజ్ దగ్గర 12 అడుగుల నీటిమట్టాన్ని నిలువ చేస్తూ అదనపు నీటిని అధికారులు సముద్రంలో విడుదల చేస్తున్నారు. డెల్టా కాలువలకు పూర్తిగా నీటి సరఫరాని అధికారులు నిలిపివేశారు. అధికారులు ప్రకాశం బ్యారేజీ 50 గేట్లు 6 అడుగులు మేర ఎత్తగా.. 20 గేట్లను 5 అడుగులుమేరకు ఎత్తి 2,50,000 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామస్తులను నదీ పరివాహక ప్రాంతాలవారిని అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు మున్నేరుకు వరద కొనసాగుతోంది. ఇంకా వరద పెరుగుతూనే ఉందని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పారు. కీసర వంతెన-నందిగామ మండలం ఐతవరం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై మునేరు రెండు అడుగుల ఎత్తున పొంగుతోంది.
హైదరాబాద్-విజయవాడ రాకపోకలు బంద్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
by HJNEWS