న్యూఢిల్లీ: దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందేందుకు ఏటా వేల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. అయితే గత ఐదేండ్లలో ఏకంగా 8 వేల మందికిపైగా విద్యార్థులు ఐఐటీల నుంచి డ్రాపౌట్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు. మొత్తంగా ఉన్నత విద్యాసంస్థల నుంచి 32 వేల మందికిపైగా విద్యార్థులు డ్రాపౌట్ అయినట్టు చెప్పారు. కేంద్ర విశ్వవిద్యాలయాల నుంచి 17,454 మంది, ఐఐటీల్లో 8,139, ఎన్ఐటీల్లో 5,623, ఐఐఎస్ఈఆర్ నుంచి 1046, ఐఐఎంల నుంచి 858 మంది డ్రాపౌట్ అయినట్టు చెప్పారు. వీరిలో 52 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారేనని తెలిపారు.
గత ఐదేండ్లలో ఐఐటీల్లో 39 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. మొత్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో 98 మంది బలవన్మరణానికి పాల్పడినట్టు చెప్పారు. ఐఐటీల (39) తర్వాత ఎన్ఐటీ(25), కేంద్ర విశ్వవిద్యాలయాలు (25), ఐఐఎం(4)లలో ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఒంటరిగా ఫీలవడం, హింస, కుటుంబ సమస్యలు, మానసిక రుగ్మతలు తదితర కారణాల వల్ల విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిపారు.
previous post