తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండ వాతావరణం కనిపిస్తోంది. కానీ సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పును గమనిస్తారని శాటిలైట్స్ రిపోర్ట్స్ చూపిస్తున్నాయి.
మీకు తెలుసా.. మన భూమి చుట్టూ 8వేలకు పైగా శాటిలైట్స్ తిరుగుతున్నాయి. వీటిలో చాలావరకూ మన భూమిపై వాతావరణాన్ని పరిశీలించేవి ఉన్నాయి. ఇవి నిరంతరం అదే పనిలో ఉంటాయి. మేఘాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి? తుపాన్లు ఎక్కడున్నాయి? గాలి వేగం ఎంత? అల్పపీడనాలు ఏర్పడుతున్నాయా.. ఇలా ప్రతీ సమాచారాన్ని ఈ శాటిలైట్స్ సేకరించి మనకు అందిస్తున్నాయి.
నిన్న తెలుగు రాష్ట్రాల్లో వానలు అంతగా కురవలేదు. జిల్లాలో మాత్రం భారీ వర్షం కురిసి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఐతే, కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచేశాయి. స్కూళ్లకు వెళ్లి, ఆగస్టు 15 వేడుకల్లో పాల్గొన్న పిల్లలు సైతం.. తీవ్ర ఎండలతో ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో అంటే ఉత్తర తెలంగాణలో మేఘాలు, చిరు జల్లులూ కనిపించాయి.
ఇవాళ వాతావరణానికి సంబంధించి.. NOAA GOES, JMA Himawari వంటి చాలా శాటిలైట్స్ స్పష్టమైన రిపోర్టులు ఇచ్చాయి. వాటి ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం వేళ ఎండలు దంచేస్తాయి. మధ్యాహ్నం 2 లేదా 3 గంటల వరకూ ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే.. ఉత్తర తెలంగాణలో మాత్రం కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తాయి. ఆల్రెడీ కురుస్తున్నాయి కూడా.
తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం నుంచి ఉత్తర , ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో చిరు జల్లులు కురుస్తాయని శాటిలైట్స్ సిస్టమ్స్ అంచనా వేస్తున్నాయి. ఐతే.. కోస్తా, రాయలసీమ, దక్షిణ తెలంగాణలో మాత్రం ఇవాళ వర్షాలు కురిసే అవకాశాలు కనిపించట్లేదు.
నిజానికి ఇవాళ భారీ వర్షాలు కురవాలి. ఎందుకంటే.. మయన్మార్, థాయిలాండ్, బంగ్లాదేశ్ పైన భారీ మేఘాలున్నాయి. అవన్నీ మన తెలుగు రాష్ట్రాలవైపు వస్తే బాగుండేది. కానీ గాలుల వేగం జోరుగా లేదు. అందువల్లే అవి నిన్నటి నుంచి అక్కడే ఉంటున్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం దొరకట్లేదు. (All Images credit – IMD)