”ప్రతి ఏటా వరద వస్తుంది…జనం ఊరొదిలి వెళ్లిపోతారు….వరద తగ్గాక సొంతిళ్లకు వచ్చి అన్నీ సర్దుకుంటారు. నెమ్మదిగా మామూలు జీవితానికి అలవాటు పడతారు. ఇక్కడ తరతరాలుగా ఇలాగే జరుగుతోంది.”
ఇటీవల దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురవడంతో నగరాలు, పట్టణాల్లోని ప్రజలు అల్లాడిపోయారు. అప్పుడప్పుడూ వస్తున్న వరదలకే తీవ్ర అవస్థలు పడ్డారు.
కానీ, గోదావరి తీరంలోని వందల గ్రామాలకు చెందిన వేల కుటుంబాలకు వరదలు అత్యంత మామూలు విషయం. అవి వారి జీవితంలో భాగం.
ఒక్కోసారి ఉధృతంగా మారే వరదలను సైతం ఎదుర్కొంటూ గోదావరి లంక వాసులు జీవనం కొనసాగిస్తున్నారు.
ఏటా గోదావరికి జులై, ఆగస్టు మాసాల్లో వరదల సీజన్ ఉంటుంది. ఈ ఏడాది కూడా జులై నెలాఖరులో వరదలొచ్చాయి. కిందటేడాది కూడా భారీ వరదలొచ్చాయి. ఇలా వరదలు వచ్చిన ప్రతిసారీ పిల్లాపాపలతో సామాన్లు తీసుకుని ఒడ్డుకు చేరడం వారికి అలవాటు.
గతేడాది వరదల సమయంలో సుమారు నెల రోజుల పాటు తాత్కాలిక శిబిరాల్లోనే తలదాచుకున్నారు. ఈసారి మాత్రం వారం రోజులతో ఊపిరి పీల్చుకున్నారు.
ఏటా ఇల్లు వదిలివెళ్లడం, మళ్లీ వచ్చేసరికి ఇల్లు, ఇంట్లో సామాన్లు కూడా భద్రంగా ఉంటాయన్న ధీమా లేకపోయినా వారంతా లంకల్లోనే ఎందుకుంటారు? లంక గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది?
- వరద వచ్చినప్పుడు లంకగ్రామాలు ఇలా ఉంటాయి.
గోదావరి నదీ ప్రవాహం పాపికొండల దిగువన భిన్నంగా ఉంటుంది. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరిగా మారుతుంది. ధవళేశ్వరం దిగున పాయలుగా ప్రవహిస్తుంది. అయినా ప్రవాహపు పరిధి విస్తృతంగా ఉంటుంది. దాంతో ఇసుక మేటలు ఏర్పడి క్రమంగా లంకలుగా పరిణామం చెందుతూ వస్తున్నాయి.
అదే సమయంలో, ప్రవాహపు వడి వేగానికి కొన్ని లంకలు కొట్టుకుపోవడం, కొత్త లంకలు ఏర్పడడం నేటికీ జరుగుతోంది.
అలా గోదావరి నదీ గర్భంలో ఏర్పడిన లంకలనే ఆవాసాలుగా చేసుకుని వేల మంది జీవనం సాగిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు దిగువన అలాంటి లంక గ్రామాలు చిన్నా, పెద్దా కలిపి సుమారుగా వందకు పైగా ఉన్నాయి.
దాదాపుగా 4 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
లంకల్లో వ్యవసాయం కోసం కొందరు, చేపల వేట ఆధారంగా చేసుకున్న మత్స్యకారులు మరికొందరు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
వ్యవసాయం వృద్ధి చెందిన కోనసీమ లంకల్లో కొంత అభివృద్ధి కనిపిస్తుంది. స్థిరమైన భవనాలు, రోడ్డు, వంతెనలు వంటివి కొన్ని లంకలకు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని లంకలకు వరదలు లేని సమయంలో రవాణాకి అనుగుణంగా కాజ్ వేలు వంటివి ఏర్పాటు చేశారు.
మత్స్యకారులు నివసించే గ్రామాలకు మాత్రం కనీస సదుపాయాలు అందుబాటులోకి రాలేదు.
ఆయా లంక గ్రామాలు చాలా చిన్నవిగా ఉండడమే దానికి ప్రధాన కారణంగా అధికారులు చెబుతుంటారు. వందల ఏళ్ల క్రితమే ఇలా లంకల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంటుంది.