సింగిల్ మదర్స్‌కు ఉపాసన కొణిదెల (Upasana Konidela) గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై అపోలో చిల్డ్రన్స్ హాస్పటిల్‌లో వారాంతాల్లో సింగిల్ మదర్ చిల్డ్రన్స్‌కు ఉచితంగా డాక్టర్ కన్సల్టెన్సీ అందిస్తామన్నారు. అపోలో నుంచి సింగిల్ మదర్స్‌కు తాము అందిస్తున్న ఈ చిన్నసాయం వాళ్లకు కచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నానని తెలిపారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, సీఎస్ఆర్-అపోలో వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల.. సింగిల్ మదర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై వారాంతాల్లో సింగిల్ మదర్స్ తమ పిల్లలను అపోలో చిల్డ్రన్ హాస్పిటల్స్‌కు తీసుకువెళ్లి ఉచితంగా వైద్యం (డాక్టర్ కన్సల్టెన్సీ – ఓపీడీ) పొందవచ్చని ప్రకటించారు. ఈ సాయం వాళ్లకు కచ్చితంగా ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నానని అన్నారు.
ప్రత్యేకంగా చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించడం కోసం అపోలో హాస్పిటల్స్‌కు అనుబంధంగా అపోలో చిల్డ్రన్స్ బ్రాండ్‌ను సోమవారం ఉపాసన లాంచ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అపోలో చిల్డ్రన్స్ లోగోను ఆవిష్కరించిన తరవాత ఉపాసన మాట్లాడుతూ.. తాను గర్భం దాల్చిన తరవాత అందరూ తనపై ఎంతో ప్రేమను కురిపించారని, ఆశీస్సులు అందించారని వారందరికీ ధన్యవాదాలు అని అన్నారు.
‘నేను గర్భవతిని అయిన దగ్గర నుంచి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఆ జర్నీలో నాకు ప్రోత్సాహం అందించిన అందరికీ ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, మీ ప్రేమ నాకు అందించినందుకు థాంక్యూ. మా ప్రెగ్నెన్సీ జర్నీని ఎంతో అందంగా మార్చిన మీడియాకు థాంక్యూ. అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్‌ను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇది చాలా ఎమోషనల్ జర్నీ. పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. ఆ పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం మా అందరి బాధ్యత.
పిల్లలు, వారి తల్లిదండ్రుల మొహాల్లో చిరునవ్వులకు కారణమవుతున్న వైద్యులకు ధన్యవాదాలు. ఒక తల్లిగా నేను ఇప్పుడు అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నాను. గతంలో ఇతర తల్లుల మొహాల్లో ఆ ఆనందాన్ని చూసేదాన్ని. కానీ ఇప్పుడు పిల్లలకు అనారోగ్యం వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతలా అల్లాడిపోతారో ఇప్పుడు నాకు తెలుస్తోంది. నేను గర్భం దాల్చినప్పుడు నాకు ఎంతో మంది సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్ని ఆశీస్సులు ఉన్నా బిడ్డకు జన్మనిచ్చిన తరవాత కొంత మంది తల్లులు ఇబ్బంది పడడం నేను చూశాను. కొంత మంది మహిళలు నా దగ్గరకు వచ్చి తమ బాధ చెప్పుకున్నారు. వాళ్లలో సింగిల్ మదర్స్ ఉన్నారు. వాళ్లకు సపోర్ట్ అవసరం.
కాబట్టి, సీఎస్ఆర్-అపోలో వైస్ చైర్‌పర్సన్‌గా ఈ ప్రకటన చేస్తున్నాను. వారాంతాల్లో సింగిల్ మదర్స్ తమ పిల్లలను అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్‌కు తీసుకెళ్లి ఉచితంగా వైద్యం (ఓపీడీ) పొందుచ్చు. ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది సింగిల్ మదర్స్‌కు, వారి పిల్లలకు లాభం చేకూరుతుందని నేను భావిస్తున్నాను. నేను వాళ్లకు ఎప్పుడూ ప్రోత్సహం ఇస్తాను. ఇదొక ఎమోషనల్ జర్నీ. నేను ఫీల్ అయినట్టే.. ఆ తల్లులు కూడా ఫీలవ్వాలి’ అని ఉపాసన చెప్పుకొచ్చారు.
అయితే, సింగిల్ మదర్స్‌కు డాక్టర్ కన్సల్టెన్సీని ఉచితంగా అందించడం వెనుక కారణాన్ని కూడా ఆమె వివరించారు. ప్రస్తుతం అమ్మతనాన్ని తాను ఆస్వాదిస్తున్నానని.. బిడ్డకు అనారోగ్యం చేస్తే తల్లి మనసు ఎంతలా తల్లడిల్లిపోతుందో తనకు తెలుసని అన్నారు. అదృష్టవశాత్తు తనకు ఒక మంచి భర్త దొరికాడని.. బిడ్డ ఆలనాపాలనా చూసుకోవడంతో ఆయన కూడా ఎంతగానో సహకరిస్తారని చెప్పారు. అయితే, భర్త సాయం లేకుండా పిల్లలను పోషించే తల్లుల పరిస్థితి ఏంటని ఉపాసన ప్రశ్నించారు. అలాంటి తల్లుల బాధను తెలుసుకున్నాను కాబట్టే వాళ్లకు వారాంతాల్లో డాక్టర్ కన్సల్టెన్సీ ఉచితంగా అందిస్తామని ప్రకటించినట్టు వివరించారు.