ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇద్దరు మహిళలు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మున్ని అనే మహిళకు ఒకే కాన్పులో ఇద్దరు మగ పిల్లలు, మరో ఆడపిల్ల జన్మించారు. అలాగే నంద్యాలలో కూడా మరో మహిళకు ఇద్దరు ఆడ పిల్లలు, మరో మగపిల్లాడు జన్మించారు. తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు,బంధువులు డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.కర్నూలు జీజీహెచ్లో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. కృష్ణగిరికి చెందిన మున్నికి అక్బర్బాషతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. మొదటి సారి అబార్షన్ కాగా ఐదేళ్ల క్రితం సాధారణ ప్రసవం అయ్యింది. అప్పటి నుంచి ఆమె మళ్లీ గర్భం దాల్చకపోవడంతో గైనకాలజీ విభాగంలో డాక్టర్లు వైద్యం అందించారు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చింది.. కొంతకాలం తర్వాత స్కానింగ్ చేయగా ఆమె గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ఆమెకు వైద్యం అందించారు.. ఆమెకు జాగ్రత్తలు చెబుతూ వచ్చారు.మున్ని 25 రోజులు ముందుగా ఈ నెల 5న ఆసుపత్రిలో చేరగా.. అవసరమైన వైద్యం అందించారు. ఆమెకు శనివారం సిజేరియన్ ద్వారా కాన్పు చేయగా.. ప్రసవంలో ఒక ఆడ, ఇద్దరు మగశిశువులు జన్మించారు. ఆడ శిశువు, మగశిశువు రెండేసి కిలోలు బరువు ఉండగా.. మరో మగశిశువు 1.5కిలోల బరువు ఉన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.నంద్యాలలో కూడా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. నంద్యాలలోనీ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన యశోద అనే మహిళ ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డ జన్మించారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు, తల్లి పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు,బంధువులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
కర్నూలు, నంద్యాలలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం
122 Views