విజయవాడ-హైదరాబాద్ హైవేపై కృష్ణా జిల్లా ఐతవరం దగ్గర మున్నేరు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ వరదలో విద్యార్థులు చిక్కుకున్నారు. పోలీసులు వారిని క్రేన్ సహాయంతో అవతలి ఒడ్డుకు చేర్చి పరీక్ష రాసేందుకు పంపారు. నందిగామలోని కాకాని వెంకటరత్నం కాలేజీలో డిగ్రీ సెమిస్టర్ పరీక్ష రాసేందుకు ఇబ్రహీంపట్నం, కంచికచర్ల ప్రాంతాల నుంచి నందిగామకు కొందరు విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లో ఐతవరం వరకు వెళ్లారు.కానీ అక్కడ హైవేపై మున్నేరు నది ప్రవహిస్తుండటంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ సమయంలో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. క్రేన్ సహాయంతో విద్యార్థులను అవతలికి తరలించారు. అక్కడి నుంచి వారు పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లారు. మరోవైపు నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఆర్డీవో రవీందర్‌రావు అక్కడికి వెళ్లి పరిశీలించారు. మున్నేరు వరద ప్రవాహంపై అధికారులతో మాట్లాడారు.నందిగామ దగ్గర పల్లగిరి కొండ సమీపంలో మున్నేరు వరదల్లో గురువారం మధ్యాహ్నం నుంచి చిక్కుపోయిన ముగ్గురు వ్యక్తులను ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రక్షించింది. బాధితులను సహాయక బృందాలు బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం దగ్గర గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్‌గేట్ నుంచి విజయవాడ వైపు సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. హైవేపై వాహనాలను పలుమార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. ఐతవరం దగ్గర బస్సులు, ఇతర పెద్ద వాహనాలు నిలిపివేశారు. మున్నేరుపై వరద కొనసాగుతోంది. ఐతవరం దగ్గర 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలను పోలీసులు కోదాడ దగ్గర దగ్గర దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న వాహనాలను హుజూర్‌నగర్, మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదుగా విజయవాడకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. గుంటూరు మీదుగా మరికొన్ని వాహనాలను మళ్లించారు. విశాఖ వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గుంటూరు మీదుగా మళ్లించారు.
హైదరాబాద్ – విజయవాడ హైవేపై మున్నేరు వరద.. క్రేన్‌తో విద్యార్థుల తరలింపు
by HJNEWS