సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోన్న వేళ.. కృష్ణా జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత పట్టు బిగిస్తోంది. కీలక నియోజకవర్గాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టేలా వ్యూహాలను రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా భారీగా చేరికలకు తెర తీసింది.
ఈ క్రమంలో గుడివాడ నియోజకవర్గానికి చెందిన టీడీపీ మైనారిటీ విభాగానికి చెందిన వెయ్యిమంది నాయకులు, కార్యకర్తలు పార్టీ ఫిరాయించారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. స్థానిక శాసన సభ్యుడు, మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఉండబోదని కొడాలి నాని అన్నారు. జనాదరణ ఉన్న వారిని కాకుండా.. పెత్తందారులకు టీడీపీ టికెట్లను ఇస్తోందంటూ విమర్శించారు. గుడివాడ టీడీపీ టికెట్‌ను ఎన్నారై వెనిగండ్ల రాముకు ఇవ్వడాన్ని ఉదహరించారు. చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తారని విమర్శించారు కొడాలి నాని.
దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అన్ని సామాజిక వర్గాల వారికీ టికెట్లను ఇస్తోన్నారని, బీసీలు, మైనారిటీలు, దళితులకు పెద్దపీట వేస్తోన్నారని కొడాలి నాని చెప్పారు. అన్ని విభాగాల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని అన్నారు. చంద్రబాబు సీట్లను అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. దశాబ్దాల కాలం పాటు పార్టీ కోసం పని చేసే వారిని కాకుండా 150 కోట్ల రూపాయలకు గుడివాడ సీటును ఎన్నారైకు అమ్ముకున్నారని విమర్శించారు. ఈ అమెరికన్ ఎన్ఆర్ఐకి గుడివాడ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరిపైనా విమర్శలు చేశారు కొడాలి నాని. జగన్ ప్రభుత్వం ఇష్టానుసారంగ అప్పులు చేస్తోందంటూ పురంధేశ్వరి బాధపడుతున్నారని, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే రుణాలను తీసుకుంటోందనే విషయం ఆమెకు తెలియదా? అని ప్రశ్నించారు. పరిమితికి మించి అప్పులు చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు కదా అని అన్నారు.