ప్రకాశం జిల్లా కనిగిరిలోని కపిలసెంటర్‌లో నడిరోడ్డుపై కలకలం రేగింది. కొంతమంది వ్యక్తులు వీఆర్‌వో వేణుగోపాల్‌రెడ్డిని పట్టుకుని తీసుకొచ్చారు. నడిరోడ్డుపై ఓ స్టూలు ఉంచి దానిపై ఉంచిన నీటి గ్లాసులో వీఆర్‌వో చేతులను ముంచారు. వీఆర్‌వో చేతులు ఎరుపు రంగుకు మారడంతో అతడ్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఏం జరుగుతుందో తెలియని చుట్టుపక్కల జనం గుమిగూడారు. ఏం జరుగుతుందో మాకు తెలియాలి అంటూ ఆరా తీశారు. విషయం తెలుసుకున్నాక అందరూ ఒక్కసారిగా ఆవాక్కయ్యారు. ఇదంతా ఏసీబీ అధికారులు వేసిన ట్రాప్‌గా గుర్తించి..! అమ్మమ్మ.. నడిరోడ్డుపైనే లంచం తీసుకుంటున్నావా.. అంటూ వీఆర్‌వోను చూసి ముక్కున వేలేసేకున్నారు
కనిగిరి మండలం ఏరువారిపల్లికి చెందిన వీఆర్‌వో వేణుగోపాల్‌రెడ్డి హాజీపురం గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డికి చెందిన పొలం తాలూకూ పాస్‌బుక్ ఇవ్వడానికి 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. తన పాస్ బుక్ తనకు ఇవ్వడానికి లంచం ఎందుకు ఇవ్వాలన్న కారణంగా లక్ష్మీరెడ్డి ఒంగోలులోని ఏసీబీ అదికారులను ఆశ్రయించాడు. దీంతో ముందుగా వేసుకున్న పధకం ప్రకారం ఏసీబీ అధికారులు వలపన్నారు. కనిగిరి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఏరువారిపల్లి వీఆర్‌వో వేణుగోపాల్‌రెడ్డి లంచం డబ్బులు తీసుకునేందుకు పట్టణంలోని కపిలసెంటర్‌కు రావాల్సిందిగా లక్ష్మీరెడ్డిని కోరాడు. దీంతో లక్ష్మిరెడ్డి కపిల సెంటర్‌కు చేరుకున్నాడు.
అదే ప్రాంతంలో రహస్యంగా మాటువేసిన ఏసీబీ అధికారులు సమయం కోసం వేచి చూశారు. లక్ష్మీరెడ్డి దగ్గర 20 వేలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి వీఆర్‌వో వేణుగోపాల్‌రెడ్డిని పట్టుకున్నారు. వెంటనే అతడి చేతులను పట్టుకుని అక్కడే రోడ్డుపై ఓ స్టూలుపై నీళ్ళల్లో వేణుగోపాల్‌రెడ్డి చేతులను ముంచారు. అప్పటికే డబ్బులకు పౌడర్ అంటించి పంపిన ఏసిబి అధికారులకు వీఆర్‌వో చేతులు ఎరుపు రంగుకు మారడంతో అతడు లంచం తీసుకున్నట్టు రెడ్ హ్యాండ్‌లను చూసి నిర్ధారించుకున్నారు. వెంటనే వేణుగోపాల్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని అతని దగ్గర ఉన్న 20వేల రూపాయల లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా నడిరోడ్డుపై జరగడంతో ఏం జరుగుతోందన్న ఆతృతతో జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. లంచావతారాలను పట్టుకున్న సమయంలో ఏం జరుగుతుందో, నడిబజార్లో పరువు ఎలా పోతుందో ఈ ఘటన ఓ ఉదాహరణ అంటూ జనం వ్యాఖ్యానించారు