బీజేపీపై తిరుగుబాటు చేసిన కర్ణాటక మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్పను శాంతింపజేసేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక బీజేపీ ఇన్ చార్జ్ రాధామోహన్ దాస్ అగర్వాల్ ప్రయత్నించారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే నిర్ణయానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప గట్టి పట్టుదలతో ఉన్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలోని శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు, సిట్టింగ్ ఎంపీ బీవై రాఘవేంద్రపై కేఎస్ ఈశ్వరప్ప స్వతంత్ర పార్ట అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. రాధామోహన్ దాస్ అగర్వాల్‌తో పాటు మరికొందరు బీజేపీ సీనియర్ పార్టీ నాయకులు ఈశ్వరప్పను కలుసుకుని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే ఈశ్వరప్ప తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని గట్టిగానే బీజేపీ నాయకులకు చెప్పారని వెలుగు చూసింది.
లోక్ సభ ఎన్నికల్లో తాను స్వతంత్ర పార్ట అభ్యర్థిగా పోటీ చేస్తానని కేఎస్ ఈశ్వరప్ప పట్టుబడుతున్నారు. తన మనసును ఎవరూ మార్చలేరని కూడా ఆయన రాధ మోహన్ దాస్ అగర్వాల్ కు తేల్చి చెప్పారని తెలిసింది. మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్పతో భేటీ అనంతరం రాధామోహన్ దాస్ అగర్వాల్ శివమొగ్గలో విలేకరులతో మాట్లాడుతూ ఇది తన వ్యక్తిగత సమావేశమని, ఈ భేటీకి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మేం ఒకే పార్టీలో ఉంటున్న స్నేహితులం, ఇది నా వ్యక్తిగత పర్యటన. నేను ఆయన కుటుంబంతో కూర్చుని మాట్లాడానని, అక్కడ ఈశ్వరప్ప పిల్లలు కూడా ఉన్నారని, మేము పిల్లలతో రాజకీయాలు మాట్లాడమని, ఈశ్వరప్ప కుటుంబాన్ని కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇది రాజకీయ భేటీ కాదని రాధా మోహన్ దాస్ అగర్వాల్ అన్నారు. బీజేపీ కర్ణాటక ఇన్ చార్జ్ రాధామోహన్ దాస్ అగర్వాల్ తాను ఈశ్వరప్పను ఒప్పించడానికి రాలేదని మీడియాకు చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేశారు
తన కుమారుడు కేఈ కాంతేష్‌కు ఎంపీ టికెట్ నిరాకరించినందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్ప ఆదివారం మరోసారి విరుచుకుపడ్డారు. యడ్యూరప్ప, కేఎస్ ఈశ్వరప్పల స్వస్థలమైన శివమొగ్గలో సోమవారం జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఆయన మూడోసారి ప్రధాని కావాలని కేఎస్. ఈశ్వరప్ప అంటున్నారు. ఇదే సమయంలో కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, ఆయన కుటుంబీకుల నుంచి బీజేపీని విడిపించాలని, ఆ ఉద్దేశంతోనే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్ప విలేకరులతో అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో సీట్లు గెలవడానికి యడ్యూరప్ప మాత్రమే సహకరిస్తారనే భ్రమలో కేంద్ర స్థాయిలోని బీజేపీ నేతలు ఉన్నారని, కర్ణాటకలో జరుగుతున్న నీచ రాజకీయాల గురించి కేంద్ర నాయకత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే తాను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కుటుంబ నియంత్రణలో ఉన్న పార్టీ అని మేము అంటున్నామని, అందుకు ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను కూడా టార్గెట్ చేస్తున్నారని, అలాంటప్పుడు కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ లాగా మారుతుందని కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. యడ్యూరప్ప ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ కౌన్సిల్ సభ్యుడు, ఆయన కుమారుడు విజయేంద్ర బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారని ఈశ్వరప్ప ఆరోపించారు. బీఎస్ యడియూరప్ప మరో కొడుకు రాఘవేంద్ర ఎంపీగా ఉన్నారని, ఇప్పుడు మళ్లీ ఎంపీ టిక్కెట్ ఇచ్చారని, ఒక కుటుంబం ఆధీనంలో ఉన్న కర్ణాటక బీజేపీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధాంతాలకు విరుద్ధం అని. దీనిపై నేను నిరసన తెలుపుతున్నానన్న విషయం కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతలకు అర్థమవుతుందని, అందుకే తాను లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని కర్ణాటక మాజీ డీసీఎం కేఎస్. ఈశ్వరప్ప అన్నారు.