YS Jagan: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్
ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, కేశినేని శ్వేత, నల్లగట్ల స్వామిదాస్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, కొలుసు పార్థసారథి, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, రావెల కిశోర్ బాబు.. ఇలా సీనియర్లందరూ పార్టీలు ఫిరాయించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పార్టీ ఫిరాయించిన వారిలో ఉన్నారు
తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి.. ఈ జాబితాలో చేరారు. బీజేపీకి గుడ్‌బై చెప్పిన ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు.
భూమా కిషోర్ రెడ్డి సొంత నియోజకవర్గం.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ. భూమా కుటుంబానికి చెందిన నాయకుడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు అన్న వరుస అవుతారు. ఆమె పెదనాన్న కుమారుడే కిశోర్ రెడ్డి. ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలపై ఆయన గట్టిపట్టు ఉంది.
ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించారు భూమా కిశోర్ రెడ్డి. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఆయనకు టికెట్ దక్కడం సాధ్యపడేలా కనిపించట్లేదు.
దీనితో పార్టీ ఫిరాయించాలని నిర్ణయించారు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. భూమా కిశోర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ నాయకులు.. వైసీపీ కండువా కప్పుకొన్నారు.