వజ్రపుకొత్తూరు రూరల్, కాశీబుగ్గ: మండలంలోని అక్కుపల్లి శివసాగర్ సముద్ర తీరంలో మునిగి ఆదివారం సుంకు అక్షయ(13) అనే విద్యార్థిని మృతి చెందింది. పోలీసులు, తోటి స్నేహితులు తెలిపిన వివరాలు మేరకు.. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల మారుతీ నగర్‌కు చెందిన సుంకు అక్షయ(13) కొంత మంది కాలనీ వాసులు కలిసి అక్కుపల్లి శివసాగర్ బీచ్‌కు వెళ్లారు. తీరంలో కొద్ది సేపు ఆనందంగా గడిపి సముద్ర స్నానానికి దిగారు. అంతలోనే ఓ రాకాసి అల రావడంతో అక్షయ సముద్రం లోపలకు వెళ్లిపోయింది.
ఆమెను కాపాడేందుకు కింతాడ రాజేశ్వరి ప్రయత్నించి ఆమె కూడా చిక్కుకుపోయింది. దీన్ని గమనించి తోటి పర్యాటకులు సముద్రంలో మునిగిపోతున్న వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. 108 వాహనంలో వారిని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అ యితే అప్పటికే అక్షయ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో బాధితురాలు రాజేశ్వరికి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.
సుంకు అక్షయ పలాస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మృతురాలి తల్లిదండ్రులు సుంకు కృష్టవేణి, అర్జున్‌లు జీడి కార్మికులు. ఈ విషాద ఘటనపై వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శవ పంచనామా చేసి పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం ఉంచారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు మధుసూదన్‌రావు తెలిపారు.
