టీడీపీలో చేరుతున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నానని, ఆయన అపాయింట్మెంట్ ఇస్తే వెంటనే టీడీపీలో చేరుతానని వెల్లడించారు. అవమనాలు భరించలేకనే వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు.
కృష్ణా జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు. వైసీపీని వీడుతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ విజయవాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వైసీపీని వీడుతున్నట్లు యార్లగడ్డ స్వయంగా ప్రకటన చేశారు. అంతేకాదు టీడీపీలో చేరుతున్నట్లు కూడా మీడియా ముఖంగా ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా టీడీపీలో చేరేందుకు చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నట్లు వెంకట్రావు తెలిపారు. గన్నవరం అభ్యర్ధిగా టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నానని, టీడీపీ నుంచి టికెట్ ఇస్తే గన్నవరంలో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు గన్నవరం టికెట్ ఇస్తే జగన్ను అసెంబ్లీలో కలుస్తానని చెప్పారు. వైసీపీ పార్టీ పెద్దలను టికెట్ తప్ప ఇంకేమీ అడగలేదని, తాను టికెట్ అడిగితే వాళ్లకు ఏమి అర్థమైందే తెలియదని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘పార్టీ కోసం పనిచేశాడు కానీ టికెట్ ఇవ్వలేకపోయామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పి ఉంటే బాగుండేది. పార్టీ కోసం అన్నీ చేసినా ఉంటే ఉండు.. పోతే పో అనడం బాధించింది. గన్నవరం సీటు వచ్చినప్పటి నుంచి గెలవడమే ధ్యేయంగా పనిచేశా. పెద్దల అపాయింట్మెంట్ వచ్చినా.. రాకున్నా మన బాధలు మనకుంటాయి. వైసీపీ శ్రేణులకు క్షమాపణలు చెబుతున్నా. నాకు నేనుగా మిమ్మల్ని వదిలేసి వెళ్లను. మన ఓటమే మన సమస్యలకు కారణం. నాకు జరిగినన్ని అవమానాలు రాజకీయాల్లో ఎవరికీ జరగలేదు’ అని యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన చెందారు.
‘టీడీపీ కంచుకోటగా ఉన్న గన్నవరంలో గెలిచేందుకు గత ఎన్నికల్లో నా వంతు పోరాటం చేశా. నా బలం ఇప్పుడు బలహీనత అయిందా..? మూడేళ్లుగా నాకు ఏ ప్రత్యామ్నాయం చూపలేదు. అవమానాల కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చినట్లుంది. మనం చెబితే ఒక్క పని కూడా జరగదు. అక్రమ కేసులు పెట్టారని మొత్తుకున్నా మన మాట ఎవరూ వినరు. టీడీపీలోకి వెళితే నాకు టికెట్ వస్తుందో.. లేదో తెలియదు. కానీ గన్నవరం నియోజకవర్గాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేస్తా’ అని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు