ఏపీలో ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమి, వైసీపీ మధ్య గెలిచే సీట్ల పైన అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. దేశం మొత్తం జూన్ 4న ఏపీ వైపు చూస్తుందన్నారు. అయితే, టీడీపీ కూటమి నుంచి ఇప్పటి వరకు గెలుపు పైన జగన్ స్థాయిలో ధీమా కనిపించ లేదు. ముఖ్య నేతలు ఎన్నికల తరువాత మీడియా ముందుకు రాలేదు. చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు.
జగన్ అంచనాలు
ఎన్నికల్లో గెలుపు పైన సీఎం జగన్ పూర్తి స్థాయి విశ్వాసం వ్యక్తం చేసారు. 2019 ఎన్నికలంటే ఎక్కువ సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తామని ధీమాగా చెప్పారు. జగన్ 2019లోనూ ఇదే తరహాలో ఎన్నికల తరువాత చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలిచింది.
ఇప్పుడు ఏపీలో జరిగిన భారీ పోలింగ్, గతం కంటే ఎక్కువగా నమోదు కావటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా ప్రచారం సాగింది. దీని పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఎన్నికల తరువాత తొలి సారి స్పందించిన జగన్ భారీ విజయం నమోదు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిశోర్ ఊహించని సీట్లు సాధిస్తామంటూ జగన్ వ్యాఖ్యానించారు.
గెలుస్తున్నామంటూ జగన్
జగన్ గెలుపు పైన ధీమాలో నెక్స్ట్ లెవల్ అన్నట్లుగా కనిపించారు. కానీ, టీడీపీ కూటమిలోని మూడు పార్టీల నేతలు ఇప్పటి వరకు ఈ స్థాయిలో ధీమా వ్యక్తం చేయటం లేదు. టీడీపీలో కొందరు నేతలు 135 స్థానాలు గెలుస్తామంటూ చెబుతున్నా…చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, పురందేశ్వరి, పవన్, మనోహర్ వంటి నేతలు స్పందించకపోవటం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.చంద్రబాబు షిర్డీ వెళ్లారు. లోకేష్ ఎన్నికల సరళి పైన స్పందించలేదు. పల్నాడులో అంతలా హింస జరిగినా..తొలి రోజు స్పందించిన చంద్రబాబు…తరువాత మాట్లాడలేదు. బీజేపీ నుంచి పోలింగ్ ముగిసిన తరువాత అసలు ఎలాంటి స్పందన లేదు. దీంతో..కూటమిలో ఏం జరుగుతోందని చర్చ మొదలైంది.
చంద్రబాబు క్యాంపులో మౌనం
జగన్ ఓటమే లక్ష్యంగా మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసాయి. పోలింగ్ సమయంలోనూ హోరా హోరీగా జరుగుతున్నట్లు కనిపించింది. కానీ, సాయంత్రం నుంచి పరిస్థితుల్లో మార్పు మొదలైంది. సాధారణంగా ఎన్నికలు పూర్తయిన తరువాత ప్రదాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తూ..ఫలితాలు వెల్లడయ్యే వరకూ కేడర్ లో నమ్మకం పెంచే ప్రయత్నం చేస్తాయి. కానీ, ఈ సారి టీడీపీ కూటమి నుంచి ఆ స్థాయి స్పందన కనిపించ లేదు. ఈ రోజు సీఎం జగన్ నేరుగా స్పందించారు. గెలుపు పైన విశ్వాసంగా మాట్లాడారు. కానీ, చంద్రబాబు మౌనం వీడలేదు. దీంతో..కూటమి మద్దతు దారులు..మూడు పార్టీల నేతల్లోనూ అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ పెరిగిపోతోంది.