దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళ.. అన్ని పార్టీలు కూడా కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల రణరంగంలో చావో రేవో తేల్చుకోవడానికి సన్నద్ధమౌతున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలవుతున్నాయి.
ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సాధించాలనే పట్టుదలతో ఉంది తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన పట్టును నిలపుకోవడానికి అవసరమైన కసరత్తు సాగిస్తోంది. ఇందులో భాగంగా చేరికలకు గేట్లు ఎత్తేసింది. ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి నుంచి పెద్ద ఎత్తున నాయకులను ఆకర్షించడం మొదలుపెట్టింది.
ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన అయిదుమంది సిట్టింగ్ ఎంపీలు పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్/బీజేపీ కండువాలను కప్పుకొన్నారు. పెద్లపల్లి, చేవెళ్ల, వరంగల్ ఎంపీలు బీ వెంకటేష్ నేత, కే రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలూ బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు.
ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న తన సీట్ల సంఖ్యను భారీగా పెంచుకోవడంపై దృష్టి సారించింది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ చేతిలో ఉన్న ముడుకు మూడు లోక్‌సభ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.
వీటితో పాటు అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను గెలచుకోవడంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వనుంది. ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. చేవెళ్ల- పట్నం సునీత మహేందర్ రెడ్డి, జహీరాబాద్- సురేష్ కుమార్ షెట్కార్, నల్గొండ- కుందూరు రఘువీర్, మహబూబాబాద్- పొరిక బలరామ్ నాయక్ పేర్లు ఉన్నాయి.
మిగిలిన వాటిపై పార్టీ అధిష్ఠానం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. దీనికోసం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ వెళ్లారు. కొద్దిసేపటి కిందటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితాను ఈ రాత్రికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.