ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ టికెట్ల రచ్చ కొనసాగుతూనే వస్తోంది. పలు నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు రోడ్డెక్కుతున్నారు. టికెట్ల కోసం ఆందోళనలకు దిగుతున్నారు. తమ గళాన్ని వినిపిస్తోన్నారు. కృష్ణా, ఎన్టీఆర్, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి, చిత్తూరు వంటి జిల్లాల్లో ఈ పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి
తాజాగా ఏలూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు టికెట్ దక్కలేదు. దీనితో టీడీపీ అగ్రనాయకత్వంపై బాహటంగానే విమర్శల దాడి మొదలుపెట్టారు. టికెట్ దక్కకపోవడం వల్ల టీడీపీ రెబెల్ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారాయన.
మరో మాజీ మంత్రి పీతల సుజాత కూడా నిరసన స్వరం వినిపించారు. పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పుపట్టారు. పెత్తందారులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కలుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలం పాటు పార్టీకి అంటిపెట్టుకుని, చిత్తశుద్ధితో పని చేస్తోన్న తనకు టికెట్ ఇవ్వకపోవడం సరికాదని అన్నారు.
ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. టీడీపీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోన్నాయని పీతల సుజాత అన్నారు. చంద్రబాబుకు భక్తురాలినని వ్యాఖ్యానించారు. టీడీపీ అన్నా, చంద్రబాబు అన్నా చాలా గౌరవం అని, తన తండ్రి కూడా టీడీపీలో పని చేశారని పేర్కొన్నారు.
2004లో ఆచంటలో సీటు ఇచ్చి చంద్రబాబు అప్పట్లో తనను రాజకీయాల్లోకి ప్రోత్సహించారని పీతల సుజాత గుర్తు చేశారు. 2009లో సీటు ఇవ్వలేదని, 2014లో చింతలపూడి నుంచి టికెట్ ఇవ్వగా ప్రజలను తనను ఆదరించారని అన్నారు. దళిత, మహిళ కోటాలో చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారని చెప్పారు.
ఆ తరువాతే అసలు కష్టాలు మొదలయ్యాయని పీతల సుజాత వివరించారు. సొంత పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తనను టార్గెట్ చేశారని చెప్పారు. తాను మాట్లాడితే ఎక్కడ చంద్రబాబుకు, టీడీపీకి సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో అవమానాలు, కష్టాలు, బాధలను దిగమింగుకున్నానే తప్ప.. వాటిని ఎప్పుడూ బయటపెట్ట లేదని అసలు ఆ ఆలోచనే రాలేదని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వుడ్ సీట్లు ఉన్నాయని, ఎస్సీ- మాల లేదా మహిళ కోటా కింద చంద్రబాబు తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తారని ఆశించానని, అలా జరగలేదని చెప్పారు. చంద్రబాబును తాను ఒకటే అడగదలచుకున్నానని, చేసిన తప్పేంటని ప్రశ్నించారు. మంత్రి పదవిని అప్పట్లో అర్ధాంతరంగా ఎందుకు తొలగించారు? అని నిలదీశారు.
కొందరు పెత్తందారులు తనను అణచి వేశారంటూ పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ దళిత మహిళగా తాను ఎదగడాన్ని ఓర్వలేకపోయారని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ అణచివేత కొనసాగుతోందని అన్నారు. 2019లో టికెట్ ఇవ్వలేదని, కనీసం రాష్ట్ర కమిటీలో కూడా ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. తనకు టికెట్ ఇవ్వకపోవడాన్ని చంద్రబాబు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో పీతల సుజాత టీడీపీ తరఫున రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో ఆచంట నుంచి గెలిచారు. 2009లో పోటీ చేయలేదు. 2014లో చింతలపూడి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2019లో మళ్లీ ఆమెకు టికెట్ ఇవ్వలేదు టీడీపీ టాప్ క్యాడర్. ఇప్పుడు కూడా ఆమెకు మొండిచెయ్యే చూపారు చంద్రబాబు.
ఆచంట టికెట్‌ను పితాని సత్యనారాయణకు ఇచ్చారు. చింతలపూడి నుంచి సొంగా రోషన్‌ను బరిలో దించారు. ఈ రెండూ కూడా గతంలో పీతల సుజాత విజయం సాధించిన నియోజకవర్గాలే. రెండుసార్లు టికెట్ ఇవ్వగా.. రెండుసార్లూ గెలిచారామె. ట్రాక్ రికార్డ్ బాగానే ఉన్నప్పటికీ.. టికెట్ ఇవ్వకపోవడాన్ని ఆమె తప్పుపడుతున్నారు.