చంద్రబాబుతో భేటీ తర్వాత యార్లగడ్డ వెంకట్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పోటీ చేయమంటే గుడివాడ నుంచైనా పోటీ చేస్తానంటూ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇవాళ తన అనచరులతో కలిసి హైదరాబాద్‌లో చంద్రబాబును యార్లగడ్డ కలిశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు భేటీ ముగిసింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. టీడీపీలో చేరిక, గన్నవరంలోని రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో యార్లగడ్డ చర్చించారు. టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ఈ సందర్భంగా యార్లగడ్డ తెలిపారు.
చంద్రబాబుతో భేటీ అనంతరం యార్లగడ్డ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలో టీడీపీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. గుడివాడలో అయినా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానని, విజయవాడలో పోటీ చేయమన్నా అక్కడికి వెళతానన్నారు. చంద్రబాబుతో కలిసి నడిచేందుకు సిద్దంగా ఉన్నానని, ఇప్పటినుంచి పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు. కలిసి పనిచేద్దామంటూ చంద్రబాబు తనను టీడీపీలో ఆహ్వానించారని, ఆయనతో కలిసి పనిచేయాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వైసీపీలో ఎన్నో అవమానాలు పడ్డానని, అందుకే ఆ పార్టీని వీడినట్లు మరోసారి యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు.
‘రాజకీయాల కోసం అమెరికా వదిలివచ్చా. డబ్బు సంపాదించాలనే యావతో రాజకీయాల్లోకి రాలేదు. ఆరేళ్లుగా వైసీపీలో పనిచేశాను. మూడున్నర ఏళ్లుగా పార్టీలో ఎన్నో చూశాను. వైసీపీలో ఉన్నప్పుడు అనేక అంశాలను ప్రస్తావించా. నా వర్గానికి పదవులు ఇవ్వనప్పుడు మదనపడ్డాను. వైసీపీలో మన ఇష్టాఇష్టాలతో సంబంధం ఉండదు. నాకు వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చాలా ఇష్టం. చంద్రబాబు దార్శనికుడు.. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందని అందరికీ తెలుసు. మీ పార్టీకి పనికి వస్తే నన్ను తీసుకోవాలని చంద్రబాబును కోరా. ఇవాళ చంద్రబాబును కలిసి పార్టీలో చేరడానికి సమ్మతి తెలిపా. డబ్బు కోసం రాజకీయాల్లో రాలేదు.. ఇష్టంతో వచ్చా’ అని యార్లగడ్డ పేర్కొన్నారు.
కాగా గత ఎన్నికల్లో గన్నవరం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి వల్లభనేని వంశీపై యార్లగడ్డ ఓటమి పాలయ్యారు. గత కొంతకాలంగా వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉండగా.. ఇటీవల ఆ పార్టీని వీడారు. ఈ నెల 22న యార్లగడ్డ టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 22వ తేదీన యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో నారా లోకేష్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభ వేదికగా లోకేష్ సమక్షంలో యార్లగడ్డ పసుపు కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఈ సభకు లక్ష మందికి తరలించాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. తొమ్మది ఎకరాల స్థలంలో ఈ సభకు ఏర్పాట్లు చేస్తుండగా.. పక్క నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు రానున్నారు.