ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కావస్తోంది. మరోసారి ఎన్నికలకు వెళ్లి గతంలో గెలిచిన 151 సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో అధికార పార్టీ ఉంది. సీఎం జగన్ అయితే వైనాట్ 175 అంటూ వైసీపీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ నేతలు, శ్రేణుల్లో మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమా కలిగించేలా వైసీపీ మరో కొత్త ఆలోచన చేసింది. మరో 73 రోజుల్లో తిరిగి అధికారం చేపడతామని అందరికీ గుర్తు చేసేలా ఇది ఉంది.
వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి జోగి రమేష్‌తోపాటు ఆ పార్టీ అగ్రనేతలు “జగన్ అనే నేను” పేరుతో ఏర్పాటు చేసిన కౌంట్‌డౌన్ క్లాక్ బోర్డును ఆవిష్కరించారు. ఇందులో ఇవాళ్టి నుంచి సరిగ్గా 73 రోజుల్లో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని, సీఎం జగన్ .. జగన్ అనే నేను అంటూ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనే ఆలోచనకు గుర్తుగా ఈ క్లాక్ ను ఆవిష్కరించింది.
గత ఎన్నికల సమయంలో బైబై బాబూ అంటూ ఇదే తరహాలో కౌంట్ డౌన్ క్లాక్స్ ను వైసీపీ ప్రారంభించింది. వైసీపీ శ్రేణుల్లో చంద్రబాబు పాలన ముగిసిపోతోందని, వైసీపీ పాలన వస్తోందని గుర్తుచేసేలా అప్పట్లో ఈ కౌంట్ డౌన్ క్లాక్స్ ప్రారంభించారు. ముందుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైసీపీ ఆఫీసుల్లో వీటిని పెట్టారు. ఇప్పుడు కూడా మరోసారి జగన్ అనే నేను పేరుతో ఏర్పాటు చేసిన క్లాక్ ను అన్ని వైసీపీ ఆఫీసుల్లోనూ ఉంచబోతున్నట్లు తెలుస్తోంది.