ఏపీలో ఎన్నికల వేళ తొలిసారి వైసీపీ మంత్రి ఒకరు పార్టీని వీడబోతున్నారు. తాజాగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో ఆయనకు సిట్టింగ్ సీటు దక్కలేదు. అలాగని మరో చోట అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నా ఆ అవకాశం కూడా దక్కలేదు. ఎంపీగా పోటీ చేయాలంటూ హైకమాండ్ ఆదేశించింది. దీంతో ఇష్టంలేని ఆ సీనియర్ మంత్రి ఇవాళ పార్టీని వీడి టీడీపీలో చేరిపోతున్నారు.
ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి గుమ్మనూరు జయరాంకు తిరిగి సిట్టింగ్ సీటు నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. మరోసారి ఆలూరులో పోటీకి వైసీపీ టికెట్ ఇవ్వట్లేదని తేలిపోవడంతో ఆయన ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించారు. ఇదే సమయంలో కర్నూలు పార్లమెంట్ ఇన్ ఛార్జ్ గా జయరాంకు జగన్ అవకాశం కల్పించారు. అయితే ఎంపీగా పోటీకి ఆయన సిద్ధం కాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి పార్టీ మార్పుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడిన గుమ్మనూరు జయరాం.. సాయంత్రం టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కర్నూలు జిల్లా నుంచి విజయవాడకు భారీగా అనుచరులతో కలిసి వాహనాల్లో ఆయన చేరుకున్నారు. సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంట్లో వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం అధికారికంగా పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. రాయలసీమలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన్ను టీడీపీ పార్టీలోకి ఆహ్వనిస్తోంది. అలాగే ఆయనకు గుంతకల్ సీటు కేటాయించేందుకు సిద్దమవుతోంది.